V6 News

ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలెక్కువ   : డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి

ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలెక్కువ   : డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి
  • రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా డిఫెన్సివ్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌ చేయాలి
  • బైక్‌‌‌‌ వెనుక కూర్చునేవాళ్లూ హెల్మెట్‌‌‌‌ పెట్టుకోవాలి : డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి

కరీంనగర్, వెలుగు : ‘రాష్ట్రంలో హత్యలు, వివిధ నేరాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు’ అని డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి చెప్పారు. గతేడాది రాష్ట్రంలో హత్య కేసుల్లో 800 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7,500 చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. కరీంనగర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ పరేడ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన అరైవ్‌‌‌‌ అలైవ్‌‌‌‌ రోడ్డు భద్రత అవగాహనా సదస్సులో డీజీపీ మాట్లాడారు.

రాష్ట్రంలో లాఅండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ సమస్య కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాల్‌‌‌‌గా మారాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్, రవాణా శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం మరణాలు ద్విచక్రవాహనదారులవే ఉంటున్నాయని, బైక్‌‌‌‌ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌‌‌‌ధరించాలని సూచించారు.

హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందన్నది అపోహ మాత్రమేనన్నారు. ఫోర్‌‌‌‌ వీలర్స్‌‌‌‌లో వెళ్లే వారు సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ పెట్టుకోవాలని చెప్పారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్‌‌‌‌ రూట్‌‌‌‌లో ప్రయాణించడం, ఓవర్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌తో డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు పరిసరాలను గమనిస్తూ ‘డిఫెన్సివ్‌‌‌‌ డ్రైవింగ్’ చేయాలని, ముఖ్యంగా స్కూళ్లు, గ్రామాల జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించాలని సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల సరళి మారుతోందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ క్రైం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెను సవాల్‌‌‌‌గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్‌‌‌‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో ప్రొబేషనరీ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వోగా పనిచేసిన రోజులను నెమరువేసుకున్నారు.

అనంతరం అరైవ్‌‌‌‌ అలైవ్‌‌‌‌కి సంబంధించిన స్కై బెలూన్‌‌‌‌ను ఆవిష్కరించి, హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ చిత్రా మిశ్రా, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ అశ్విని, డీఎంహెచ్‌‌‌‌వో వెంకటరమణ, ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ సోహం సునీల్, అడిషనల్‌‌‌‌ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.